ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి..క్షమాపణ చెప్పేవరకు కదిలేది లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్- జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. క్షమాపణ చెప్పేవరకు కదిలేది లేదంటూ నిరసనకు దిగారు ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది..
అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ క్యాంప్ ఆఫీసు వద్ద టెన్షన్ కంటిన్యూ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర ఫ్యాన్స్ ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్ గడువు ముగిసింది. సదరు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పలేదు. టీడీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేదు. ఈ క్రమంలో జూనియర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటి ముట్టడికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-జూనియర్‌ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు.