మోతే మండలం విబులాపురంలో తండ్రిని హత్య చేసిన కొడుకు..!

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

కన్న తండ్రిని దారి కాచి మరి గొడ్డలితో నరికి చంపిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం శివారులో చోటుచేసుకుంది. మండలంలోని నాగయ్య గూడెం గ్రామానికి చెందిన వెంకన్నకు..పెద్ద కొడుకు గంగయ్య మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. వీటిని మనసులో పెట్టుకున్న పెద్ద కుమారుడు గంగయ్య తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం రహదారి వెంబడి దారి కాచాడు. ఓ పని నిమిత్తం మామిళ్ళగూడెం వెళ్లిన తండ్రి వెంకన్న తిరుగు ప్రయాణంలో స్వగ్రామమైన నాగయ్య గూడేనికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.మార్గం మధ్యలో విభలాపురం శివారుకు రాగానే తండ్రి కోసం ఎదురుచూస్తున్న కొడుకు గంగయ్య ద్విచక్ర వాహనాన్ని వెంబడించి వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలపై వేటు వేశాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన తండ్రి రహదారిపై కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మోతె ఎస్సై యాదవేందర్ రెడ్డి వెంకన్నను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందాడు. కుమారుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.