ఇదే కాంగ్రెస్ నమూనా : ప్రైవేట్ కంపెనీల కార్యాలయాలను ధ్వంసం చేయడం!’’ కాంగ్రెస్‌ను గూండాల పార్టీ అంటూ బీజేపీ విమర్శలు..

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా‌ కార్యాలయాలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను గూండాల పార్టీ అంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించింది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నాయకుల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే ముంబై యూత్ కాంగ్రెస్ శుక్రవారం బీకేసీలోని మెటా కార్యాలయం వెలుపల నిరసన చేపట్టింది. అలాగే, హైదరాబాద్‌లోని మెటా కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే తమ నాయకుల ఖాతాలను నిలిపివేశారనే ఆరోపణలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్, ముంబైలలోని మెటా కార్యాలయాలను ధ్వంసం చేసినట్లు సమాచారం.

అయితే ఈ పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని మెటా కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, ఆ ఘటనను సోషల్ మీడియాలో ప్రదర్శించారని ప్రదీప్ భండారి ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ ఒక గూండాల పార్టీ! ఇండియన్ యూత్ కాంగ్రెస్ గూండాలు హైదరాబాద్‌లోని మెటా కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, దానిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా చొరబడి చొక్కాలు లేకుండా నిరసన తెలిపి భారతదేశాన్ని అవమానించారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్టీ అయిన కాంగ్రెస్, ఒక గూండాల పార్టీ అని విమర్శలు గుప్పించారు. ‘‘ఇదే కాంగ్రెస్ నమూనా: ప్రైవేట్ కంపెనీల కార్యాలయాలను ధ్వంసం చేయడం!’’ అని ఆయన విమర్శించారు.