ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలి:..ఎమ్మెల్సీ కవిత

*ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.* తెలంగాణ కేబినెట్ భేటీ నేపథ్యంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. *విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని* ఆమె ప్రభుత్వానికి సూచించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర,రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని తెలిపారు. *స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందని* స్పష్టం చేశారు. పట్టణ స్థానికసంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్రస్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారని అన్నారు. రాష్ట్రస్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. *మూడు ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర చేస్తోందని* తెలిపారు. మూడు అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయవివాదం తలెత్తుతుందని చెప్పారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టిప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి నడుచుకోవాలని సూచించారు. *కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని* అని హాట్ కామెంట్స్ చేశారు. *ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు.* కాంగ్రెస్, బీజేపీ పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపిందని, పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి, కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదని అభిప్రాయపడ్డారు. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ కలవాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయని తెలిపారు. కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని, బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీ కే టికెట్ ఇచ్చేవని వెల్లడించారు.