జంతుబలి లేకుండానే బక్రీద్…

ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. దీన్నే ఈద్ అల్-అధా అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండుగ సందర్భంగా దైవం కోసం తన కుమారుడిని సైతం బలిచ్చేందుకు సిద్దమైన ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా మేకపోతుల్ని బలి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది…ఖురాన్ ప్రకారం చూసినా బక్రీద్ పండుగ రోజు ప్రతీ ముస్లిం తన ఇంట్లో జంతు బలి ఇవ్వాల్సిందే. ఇలా మేకపోతులతో పాటు ఒంటెల్ని కూడా బలి ఇస్తుంటారు.

జంతుబలి లేకుండానే మొరాకోలో బక్రీద్

అలా బక్రీద్ అంటేనే జంతు బలి తప్పకుండా ఉంటుంది. కానీ ఓ ముస్లిం దేశం ఈసారి జంతు బలి లేకుండానే బక్రీద్ పండుగను చేసుకుంది. ముస్లిం దేశమైన మొరాకో.. ఈసారి సంప్రదాయ గొర్రెల బలి లేకుండానే బక్రీద్ పండుగ జరుపుకుంది.

మొరాకో రాజు మొహమ్మద్ VI ఈ మేరకు ఇచ్చిన అరుదైన ఆదేశమే దీని వెనుక కారణం. ఇది ఆయన పాలనలో తొలిసారిగా జరిగింది. అయితే గతంలోనూ రాజు ఉన్న హసన్ II హయాంలో 1963, 198, 1996లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.

జంతు బలి లేకుండానే బక్రీద్ జరుపుకున్న మొరాకో
మొరాకోలో ఈ ఏడాది బక్రీద్ కు జంతు బలి నిషేధం
జంతు బలిని నిషేధిస్తూ రాజు మొహమ్మద్ VI సంచలన ఆదేశాలు

ఇంతకీ మొరాకోలో జంతు బలిని ఎందుకు నిషేధించారు ?

మొరాకో వరుసగా ఏడు సంవత్సరాలు కరువును చూసింది. 2016 నుండి గొర్రెలు, పశువుల మందలు దాదాపు 38 శాతం తగ్గిపోయాయి. అలాగే దిగుమతి చేసుకున్న బార్లీ, గడ్డిపై ఆధారపడటం వల్ల పెరుగుతున్న మేత ఖర్చులు పశువుల పెంపకందారుల ఖర్చులను మూడు రెట్లు పెంచాయి. 2024లో బలి ఇచ్చే గొర్రె ధర 600 డాలర్ల వరకు ఉంది. ఇది మొరాకోలో కనీస నెలవారీ వేతనం 324 డాలర్ల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఇది చాలా మందికి ఈ సంప్రదాయాన్ని భరించలేనిదిగా మార్చేసింది.

రాజు ఆదేశాల వెనుక షాకింగ్ రీజన్

ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజు మొహమ్మద్ VI మొరాకో ప్రజల్ని జంతువులను కొనడం, బలి ఇవ్వడం మానుకోవాలని పిలుపునిచ్చారు. ఇది తక్కువ ఆదాయ కుటుంబాలపై కఠినమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు భయంతో కూడిన కొనుగోలు, ధరల దోపిడీని నివారించడానికి అధికారులు పండుగకు ముందు అనేక పశువుల మార్కెట్లను మూసివేశారు. పశువులపై దిగుమతి సుంకాలు తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రభుత్వం ఆస్ట్రేలియా నుండి లక్ష గొర్రెలను దిగుమతి చేసుకోవడానికి ఏర్పాటు చేసింది. దాణా ఖర్చులపై రాయితీ ఇచ్చేందుకు, అప్పులను రీషెడ్యూల్ చేయడానికి, సంక్షోభం వల్ల ప్రభావితమైన పశువుల కాపరులకు మద్దతు ఇవ్వడానికి 6.2 బిలియన్ దిర్హామ్ ల ఉపశమన ప్యాకేజీని ప్రారంభించారు..