నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪷పంచాంగం🪷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 25 – 01 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *ఏకాదశి* సా6.24 వరకు,
నక్షత్రం : *జ్యేష్ఠ* పూర్తి
యోగం : *ధృవం* తె3.40 వరకు,
కరణం : *బాలువ* సా6.24 వరకు,

వర్జ్యం : *ఉ11.26 – 1.09,*
దుర్ముహూర్తము : *ఉ6.37 – 8.07,*
అమృతకాలం : *రా9.44 – 11.27,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.47,

*_నేటి విశేషం_*

*షట్ తిల ఏకాదశి*
శ్లో॥ తిలస్నాయీ తిలోద్వర్తీ తిలహోమే తిలోదకే।
తిలభుక్ తిలదానాచ షడ్తిలాపాపనాశిని॥

మకరసంక్రమణరోజున తిలలు వేసిన నీటితోస్నానం , తిలతైలాన్ని శరీరానికి పులుముకోవడం, తిలలతో హోమం, తిలలు వేసిన నీటిని త్రాగటం, తిలలతో చేసిన తీపి వంటలను భుజించడం, తిలలను దానం చేయడం , ఈ విధంగా ఆరు రకాలుగా తిలల వినియోగాన్ని నిర్ణయసింధులో వివరించారు…..

*షట్తిల మంటే…!!*

1, *తిల స్నానము*
2, *తిల దీపము,-(తిలోద్వర్తీ – నువ్వులనూనె ఒంటికి రాసుకోవడం)*
3, *తిలహోమము,*
4, *తిలతర్పణము,*
5, *తిల భక్షణము,*
6, *తిల దానము…*

మకర సంక్రాంతి లో షట్తిల విశేషము… అలాగే (మకర మాసంలో) ఈ పక్షములో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అని వ్యవహరిస్తారు…

*తిలస్నాయీ*
*తిలోద్వర్తీ -(ఉద్వర్తనం)*
*తిలహోమీ*
*తీలోదకీ*
*తిలభుక్*
*తిలదాతా చ*
*షట్ తిలాః పాపనాశనీ* ….

*షట్ తిల ఏకాదశి*
వ్రతం గురించి వివరణ…

“ఓ ధర్మరాజా! పుష్య బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్ తిల ఏకాదశి అంటారు.
ఇది సమస్త పాపాలు నశింపజేస్తుంది, ఈ రోజున ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడమే షట్ తిల ఏకాదశి ప్రత్యేకత.
తిలలు అంటే నువ్వులు, ముందుగా నువ్వుల పిండిని వంటికి రాసుకుని స్నానాలు ఆచరించాలి.
నువ్వులతో పూజించాలి, నువ్వులతో హోమం చేయాలి, నువ్వులతో తర్పణం విడవాలి.
ఈ రోజున నువ్వులను ఆహారంలో ఒక పదార్థంగా తీసుకోవాలి, నువ్వులను దానం చేయాలి.
ఇలా ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడమే షట్ తిల ఏకాదశి.
ఈ ఏకాదశి వ్రతకథ గురించి పులస్త్య ఋషి దౌలుభ్యునితో చెప్పిన కథను ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను” అని శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రతకథను చెప్పనారంభించాడు.

*వ్రతకథ*
ఒక బ్రాహ్మణి అనేక వ్రతాలు ఆచరిస్తుండడంతో ఆమె శరీరం బాగా చిక్కిపోయింది.
అయితే ఆమె ఏనాడూ ఒక దేవతను ఉద్దేశించి కూడా అన్నదానం, ద్రవ్యదానం, వస్తుదానం వంటివి ఇవ్వలేదు. వ్రతాదులతో శరీర అంతఃకరణ శుద్ధి అయిన బ్రాహ్మణికి మరణానంతరం స్వర్గప్రాప్తి తప్పదు కాని, ఆమె ఏ ఒక్క ప్రాణికి దానం ఇవ్వనందువల్ల వట్టి చేతులతో వెళ్ళవలసి వచ్చింది.
ఇది గమనించిన విష్ణువు ఆమెను పరీక్షించడానికి సాధువు రూపంలో బ్రాహ్మణి ముందు భిక్షకై నిలుచున్నాడు. ఆమె ఓ మట్టిగడ్డను భిక్షాపాత్రలో వేసింది.
కొంత కాలానికి బ్రాహ్మణి శరీరం వదిలి, మట్టిని దానం చేయడంవలన, స్వర్గలోకంలో సుందరమైన భవంతి లభించినా అన్నపానాదులకు సామగ్రి ఏమీ లేవు.
ఆ పరిస్థితికి భయపడిన ఆమె, “ప్రభూ! అనేక వ్రతాలు ఆచరించి నిన్ను పూజించాను, దానికి ఇదా ప్రతిఫలం? ఈ దుస్థితికి విముక్తి లేదా?” అని పరమాత్ముని వేడుకుంది.
“నీకు దక్కిన సుందర నివాసానికి వెళ్లు, నిన్ను చూడడానికి దేవతాస్త్రీలు వచ్చి, ‘గృహద్వారం తెరువు’ అని అడుగుతారు.
కానీ నీవు షట్ తిల ఏకాదశి వ్రతం గురించి చెప్పమని ప్రార్థించు, చెప్పేవరకు తలుపులు తెరువవద్దు” అని విష్ణువు పరిహారం చూపించాడు.
ఆమె అలాగే చేసింది, వారిలో ఒక దేవతాస్త్రీ షట్ తిల ఏకాదశి మహిమను వివరించి, “నష్టపోయిన భాగ్యాన్ని తిరిగి సంపాదించి పెట్టేదే ఈ షట్ తిల ఏకాదశి” అని చెప్పింది.

అప్పుడు తలుపులు తెరిచిన బ్రాహ్మణిని చూసి దేవతాస్త్రీలు ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయారు.
తరువాత బ్రాహ్మణి షట్ తిల ఏకాదశి వ్రతం ఆచరించగా, ఆ భవంతిలో ఆహారపదార్థాలతోపాటు సమస్త సామగ్రి చేరింది”…
“షట్ తిల ఏకాదశి వ్రతాచరణ ప్రభావం అలా జరిగింది” అని శ్రీకృష్ణుడు వ్రతఫలాన్ని ధర్మరాజుకు వివరించాడు.

వ్రతఫలం అన్నదానంతో షట్ తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే దారిద్య్రం తొలగి సకల పాపాలు నశించడమేకాక స్వర్గలోకప్రాప్తి కూడా కలుగుతుంది.

*_🪷శుభమస్తు🪷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏