వారణాసిలో సుమారు 6 వేల 350 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధాని మోడి..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో సుమారు 6 వేల 350 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు రైలు, రోడ్డు, నీరు, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం మరియు పట్టణ మౌలిక సదుపాయాలతో సహా కీలక రంగాలను కవర్ చేస్తాయి. ప్రధానమంత్రి మహిళా సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశ విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. లోక్‌సభ, శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

శ్రీ మోదీ రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, గంగా నదిపై రైలు-రోడ్డు వంతెన నిర్మాణంతో సహా వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ మూడవ, నాలుగవ రైల్వే లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పుణెలోని బనారస్-హడప్సర్ మరియు ముంబైలోని అయోధ్య-లోకమాన్య తిలక్ టెర్మినస్‌ను కలుపుతాయి.

ఈ రైళ్లు సరసమైన, ఆధునిక ప్రయాణ సౌకర్యాలను అందించడంతో పాటు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. బనారస్-పూణే సర్వీస్ కాశీ విశ్వనాథ ధామ్‌కు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుండగా, అయోధ్య-ముంబై సర్వీస్ శ్రీ రామ్ మందిర్ తీర్థ క్షేత్రానికి అనుసంధానాన్ని మెరుగుపరుస్తూ, కీలకమైన పుణ్యక్షేత్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ రెండు కొత్త సర్వీసుల ప్రారంభంతో, ప్రస్తుతం నడుస్తున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మొత్తం సంఖ్య 66కి పెరిగింది. అదే సమయంలో, మూడవ మరియు నాల్గవ రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్, కాశీ విశ్వనాథ ధామ్ మరియు జాతీయ రహదారి-19కి ప్రవేశాన్ని మెరుగుపరచడంతో పాటు, తూర్పు ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్‌లతో రైలు అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది.

రేపు, శ్రీ మోదీ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనం, పూజలు నిర్వహిస్తారు. పర్యటనలో భాగంగా రెండవ దశలో, ప్రధానమంత్రి రేపు హర్దోయ్‌కు వెళ్లి గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తారు. ఇది 594 కిలోమీటర్ల పొడవు, 6 లేన్‌లు గల, యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హై-స్పీడ్ కారిడార్. దీని మొత్తం వ్యయం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది.