అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన కుమారుడు…!

దసరా రోజు 3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన కుమారుడు

విశాఖపట్నం – మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు కుమారుడు హరీష్ (19) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఇటీవల బైక్ కావాలని అడిగితే డబ్బుల్లేవని చెప్పిన తండ్రి

అయినా కుమారుడు వినకుండా అలిగి.. మొండిపట్టు పట్టడంతో చివరికి రూ.3లక్షలు అప్పు చేసి దసరా రోజున బైక్‌ను కొనిచ్చిన తండ్రి

అయితే టిఫిన్ చేయడానికి ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు స్నేహితుడు వినయ్‌తో కలిసి కొత్త బైక్ పై వెళ్లి.. టిఫిన్ చేసిన తరువాత స్నేహితుడిని ఇంటి వద్ద దించడానికి కాంప్లెక్స్ నుంచి మితిమీరిన వేగంతో వెళ్తుండగా సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన హరీష్

ప్రమాదంలో హరీష్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుకు హరీష్ మృతి

స్వల్పగాయాలతో బయటపడ్డ వెనకాల కూర్చున్న స్నేహితుడు వినయ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

అప్పు చేసి మరీ బైక్ కొనుగోలు..
మహారాణిపేటకు చెందిన శ్రీనివాసరావుకు ఒక కుమారుడు హరీష్ (19), కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరీష్ ఇటీవల ఇంటర్‌ పూర్తిచేసి, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తనకు బైక్ కావాలని తండ్రిని అడిగాడు హరీష్. తనకు ఆర్థిక స్థోమత లేదని, బైక్ కొనివ్వడానికి డబ్బులు లేవని చెప్పడంతో హరీష్ నిరాశ చెందాడు. తండ్రి ఎంత చెప్పినా, ఆ మాటలు వినిపించుకోలేదు. తనకు కచ్చితంగా బైక్ కావాలని పదేపదే అడగటంతో శ్రీనివాసరావు ఏకంగా రూ.3 లక్షలు అప్పు చేసి మరీ దసరా రోజున కుమారుడు హరీష్‌కు బైక్‌ కొనిచ్చారు.

అంతలోనే విషాదం..
ఆదివారం (అక్టోబర్ 5న) అర్ధరాత్రి టిఫిన్‌ చేయడానికి హరీష్ తన ఫ్రెండ్ వినయ్‌తో కలిసి కొత్త బైక్‌పై ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద వెళ్లాడు. టిఫిన్ తిన్నాక వినయ్‌ని ఇంటివద్ద డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి చాలా వేగంగా వెళ్తుండగా సిరిపురం దత్‌ ఐలాండ్‌ టర్నింగ్ వద్ద బైక్ కంట్రోల్ తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్‌ కు తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం (అక్టోబర్ 6న) ఉదయం హరీష్‌ మృతి చెందాడు. బైక్ వెనకాల కూర్చున్న వినయ్‌కి స్వల్ప గాయాలయ్యాయి. హరీష్ మృతదేహానికి కేజీహెచ్‌ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి తరువాత కుటుంబానికి అప్పగించారు. ఎంతగానో అడగటంతో అప్పుచేసి మరీ కొనిచ్చిన బైక్ కొడుకు ప్రాణం తీసిందని హరీష్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు కోరిక అతడి ప్రాణం తీసిందని తల్లిదండ్రులు అన్నారు…