భోగి, సంక్రాంతి, కనుమ ప్రాముఖ్యత ఏమిటో ఒకేసారి చూద్దాం…?

సంక్రాంతి పండుగ అంటె ఆంధ్రప్రదేశ్ లో రెండూ తెలుగు రాష్ట్రాల లో పెదపండగలో ఒకటీ…. ఈ పండగకు కొత్త ఆల్లుడులతో ఇళ్లు కలకల గా ఉంటుంది…
పందెం రాయుళ్లు కోళ్ళ తో హుషార్ చేస్తుంటారు……
అలాంటి ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటో ఒకేసారి చూద్దాం…
no no
*భోగి, సంక్రాంతి, కనుమ ప్రాముఖ్యత ఏమిటి?*

ప్రతి మాసంలో సంక్రాంతి ఉన్నప్పటికీ మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండటానికి శాస్త్రపరంగా అనేక కారణాలు ఉన్నాయి. మనకు రెండు ఆయనములు ఉన్నాయి. ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం, మిగతా ఆరు నెలలు దక్షిణాయణం.

ఏడాదిలో ఆర్నెల్ల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. ఆర్నెల్ల దక్షిణాయణం దేవతలకు ఒక రాత్రి. దేవతలు మేలుకొని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం గనకే దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు మారిన ఈ సంక్రాంతికి అత్యంత ప్రాధాన్యత.

ఈ ఏడాది జనవరి 14వ తేదీ ఉదయం 8.15గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రోజు మకర సంక్రాంతి. 13న భోగి, 15న కనుమ, 16న ముక్కనుమ.

*భోగి విశేషాలు..*

సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినం. ఈ రోజున ప్రతిఒక్కరూ తెల్లవారు జామునే లేచి తలస్నానమాచరించాలి. సూర్యోదయానికి ముందే భోగి మంటలను వెలిగించాలి లేదా దర్శించుకోవాలి.

భోగి రోజున ఇంట్లో పాత సామాన్లు తీసేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకొనే సంప్రదాయముంది. నూతన వస్తువులు కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. భోగి రోజు నుంచి చలిని తొలగించడం, కొత్త వాటితో నిత్యనూతన జీవితం ప్రారంభించడానికి ఓ గుర్తుగా భోగి మంటలను వెలిగిస్తారు.

*భోగిమంటలను ఎలా దర్శించాలి?*

తెల్లవారు జామునే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి భోగి మంటల వద్దకు వెళ్లాలి.

అగ్ని దేవుడిని, సూర్యభగవానుడిని తలచుకొని ప్రతిఒక్కరూ తమ ఇష్టదైవాన్ని, ఇలవేల్పుని మనసులో స్మరించుకొని మంటలను దర్శించుకోవాలి. భోగి రోజుకున్న మరో ప్రాముఖ్యత.. ఆ రోజు సాయంత్రం పిల్లకు భోగిపండ్లు పోస్తారు. ఆ రేగు పండ్లు సూర్యుడికి ప్రీతిపాత్రమైనవి. వీటిని సూర్యాస్త సమయంలో పిల్లల తల మీద నుంచి పోయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం కలుగుతుందని, వారికి ఉన్న నరదృష్టి తొలగి, మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

*సంక్రాంతి రోజున ఏం చేయాలి?*

సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానమాచరించాలి. కొత్త దుస్తులను ధరించి సూర్యనారాయణుడిని స్మరించుకోవాలి. ముఖ్యంగా ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి పారాయణం చేయాలి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

ఈ రోజు రవి సంక్రమణ పుణ్యకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, సూర్యానారాయణస్వామి వ్రతం ఆచరిస్తే భక్తులకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కి సకల కోర్కెలూ నెరవేరతాయి. ఉదయం 7.30 నుంచి 9గంటల సమయంలో ఈ వ్రతాలను ఆచరించడం వల్ల శుభాలు కలుగుతాయి.

చేయాల్సిన దానాలేంటి?

సంక్రాంతి రోజు దైవారాధన ఎంత విశేషంగా చేస్తారో, రవి సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దేవతలు/పితృదేవతలకు దానాలు చేయడం ఆచారవ్యవహారాల్లో ఓ భాగం.

సంక్రాంతి అంటే మిక్కిలి అభ్యుదయమైనది అని అర్థం గనక ఈ రోజు చేసే దానాలకు అనేక రెట్లు పుణ్యఫలం దక్కుతుంది. అందుకే ఈ పెద్ద పండుగ రోజున గోదానం, భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తక దానం, బియ్యం, పప్పూఉప్పూ, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే శుభఫలితాలు వస్తాయి.

ఈ రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి ఆశీస్సులు లభించి శుభాలు కలుగుతాయి. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికీ పితృదేవతలకు తర్పణాలు వదలలేని వారు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలిస్తే ఏడాదిలో వచ్చే అన్ని సంక్రాంతులకూ ఇచ్చినట్టేనని పూర్వీకులు చెబుతుంటారు.

సంక్రాంతి రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడం, గడపకు పసుపు, కుంకుమ పెట్టడం, గుమ్మంలో ముగ్గులు వేయడం, ఇంట్లో రకరకాల పిండివంటలు చేయడం, బెల్లం పరమాన్నంచేసి సూర్యభగవానుడికి పెట్టడం వల్ల ఆ ఇంటికి ఏడాది మొత్తం శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.

*కనుమ రోజు పశు పూజ..*

కనుమను పశువుల పండుగ అంటారు. రైతులు తమ చేతికి వచ్చిన ఫలసాయాన్ని కేవలం తమ శ్రమతోనే రాలేదని, ఇందులో పశుపక్ష్యాదులకూ భాగం ఉందని విశ్వసిస్తారు. అందుకే పంటల వృద్ధి జరిగిందనడానికి గుర్తుగా కనుమ పండుగను వైభవంగా జరుపుతారు.

ఈ రోజు పశువులకు, పక్షులకు ఆహారం అందిస్తారు. గోవులకు పసుపు, కుంకుమలు పెట్టి పూజిస్తారు. తద్వారా ఆరోజు అవి సంతోషంగా ఉండేలా చూస్తారు. ఇలా చేయడం వల్ల వాటికి మనుషులపై ప్రేమ కలిగి అందరికీ శుభాలు చేకూరతాయన్నది ఓ విశ్వాసం.

కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటారు. కనుమ రోజు కచ్చితంగా తలస్నానమాచరించి సూర్యభగవానుడిని పూజించడం, ఆదిత్యహృదయ పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఇంటి బయట రథం ముగ్గు వేసి సూర్య భగవానుడి రథాల గుర్తుగా దాన్ని భావిస్తారు. కనుమ రోజు గారెలు వేసి భగవంతుడికి నైవేద్యం పెట్టడం సంప్రదాయం.