ఊరంతా పాములే..మెడలో విషపు పాములతో ఊరేగే ప్రజలు..!

ఈ ఊరికి వెళ్తే మీ ఒళ్లు జలధరించడం ఖాయం. ఇక్కడ జరిగే పండుగ చూస్తే కళ్లు మూయలేరు. మెడలో విషపు పాములతో ఊరేగే ప్రజలు, ఆ పాములను చేతుల్లో పట్టుకొని పిల్లలతో ఆడుకునే పెద్దల దృశ్యం చూస్తే, ఇది కలనా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. అసలు పాములతో ఈ సంప్రదాయం ఏంటి? ఈ వింత ఎక్కడ జరుగుతోందనే విషయాలు తెలుసుకోవాలంటే..

బిహార్ సమస్తిపూర్లోని సింధియా ఘాట్లో వందల మంది యువకులు నాగుపాములను మెడలో వేసుకొని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరలవుతోంది. పిల్లలు సైతం పామును చూసి భయపడకుండా భజనలు చేస్తూ నాగదేవత ఆలయానికి వెళ్లారు. నాగ పంచమి సందర్భంగా స్థానికులు పాముల ఉత్సవం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, గత 300 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా నాగ పంచమిని పాముల పండుగగా జరుపుకుంటారు. పాములకు పాలు పోసి, నాగదేవతలకు పూజలు చేస్తారు. కానీ బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాలోని నవ్‌టోల్ అనే గ్రామంలో ఈ పండుగకు ఉండే ప్రాధాన్యం వేరే లెవల్లో ఉంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో విషపు పాములను నదిలో నుంచి బయటకు తీసుకువస్తారు. ఆ తర్వాత ఊరంతా పాములతో ఊరేగిస్తారు. ఇది చూస్తే ఎవరికైనా కాళ్లు, చేతులు గజగజ వణకాల్సిందే…ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే, పాములు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన మనం, ఈ ఊరిలో మాత్రం ప్రజలు వాటితో పిల్లల్లా ఆడుకుంటారు. చిన్న పిల్లలు కూడా ఆ పాములను చేతుల్లో పట్టుకొని నుదుటి మీద పెట్టుకుంటారు. పెద్దవారు వాటిని మెడలో వేసుకుని ఊరేగిస్తారు. మరో వాస్తవం ఏంటంటే, ఇక్కడ పాము కాటు వల్ల మరణాలు జరగడం చాలా అరుదు. ఎందుకంటే, గ్రామస్తులు చెబుతున్న కథ ప్రకారం, పాములు వారికి హాని చేయవని విశ్వాసం ఉంది.

300 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
ఈ పాముల పండుగ అంటే పది పదుల పండుగ కాదు. ఇది సుమారు 300 సంవత్సరాలుగా ఈ గ్రామంలో కొనసాగుతోంది. స్థానికంగా పరమానంద పండుగ అని పిలిచే ఈ నాగ పంచమి వేడుకకు దూరదూరాల నుంచి భక్తులు వస్తారు. ఒక్క రోజుకి ఇది పరిమితం కాదు, వారం రోజులపాటు వేడుకలు జరుగుతాయి. పాములను నదిలోని నీటి గుంతల నుంచి తీసుకురావడం, వాటికి పాలు పోయడం, అనంతరం ఊరేగింపు ఇవన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి.