ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విద్యార్థులతో మాట్లాడారు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. భవిష్యత్తులో వ్యోమగాములు కావొచ్చని, చంద్రుడిపైనా నడుస్తారని విద్యార్థులకు చెప్పారు. హ్యామ్ రేడియో సాయంతో మాట్లాడిన ఆయన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. “నేను త్వరలోనే తిరిగి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తాను. మీలో చాలా మంది వ్యోమగాములు కావొచ్చు. కష్టపడి పని చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఒకరు చంద్రుడిపైనా నడవచ్చు.” అని శుభాంశు శుక్లా చెప్పారు.
హ్యామ్ రేడియో సాయంతో 10 నిమిషాల పాటు మాట్లాడిన ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనుభవాలను పంచుకున్నారు. వ్యోమగామిగా శిక్షణ, అంతరిక్షంలో ఆరోగ్యంగా ఉండడం లాంటి విషయాలను వివరించారు. మైక్రో గ్రావిటీ వల్ల మానవ శరీరంలో అనేక మార్పులు వస్తాయని శుక్లా చెప్పారు. అందుకోసమే అంతరిక్షంలో ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని తెలిపారు..మేము అంతరిక్షంలో సూర్యుడిని అనుసరించం. ప్రతి 90 నిమిషాలకు మేము భూమి చుట్టూ తిరుగుతాం. ఫలితంగా 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమాలను చూస్తాం. మనం భూమిపై గ్రావిటీతో పెరుగుతాం. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. ఫలితంగా శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. వీటిని స్వీకరించేందుకు మన శరీరానికి కొంత సమయం పడుతుంది. నాకు కూడా మొదట్లో కాస్త అస్వస్థతగా అనిపించింది. కొన్ని మందులు వేసుకుని వాటిని అలవాటు చేసుకున్నాను. ఈ మైక్రో గ్రావిటీ వల్ల కండరాలు, ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ప్రతి రోజు ట్రేడ్ మిల్స్, సైకిల్స్, వ్యాయామం చేయాలి. మిషన్ కోసం, భూమిపైకి తిరిగి వచ్చేందుకు ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండాలి. ఈ మిషన్‌లో శారీరకంగా, మానసికంగా అప్రమత్తంగా ఉండాలి. రోబోటిక్స్, ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ సైతం మా మిషన్‌లో అంతర్భాగం. కొన్ని పనులను మేము రోబోటిక్ సాయం చేస్తాం. దీంతో పని సురక్షితంగా పూర్తి అవుతుంది.
శుభాంశు శుక్లా, వ్యోమగామి
12 రోజులుగా అంతరిక్షంలో ఉంటున్న శుక్లా, మేఘాలయా, అసోంకు చెందిన విద్యార్థులతో మాట్లాడారు. కొంత మంది విద్యార్థులకు షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి వ్యోమగామి శుభాంశు శుక్లాతో మాట్లాడే అరుదైన అవకాశాన్ని కల్పించగా, దాదాపు 20 ప్రశ్నలను శుక్లాను అడిగారు.ఆర్మీ పబ్లిక్ స్కూల్ షిల్లాంగ్, ఆల్ఫా హైయర్ సెంకడరీ స్కూల్ నాన్గోప్, ఆర్య విద్యాపీఠ్ హైస్కూల్ గువాహటి, క్రైస్ట్ సీనియర్ సెంకడరీ స్కూల్ ఉమియమ్, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం బరపణి, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉమ్రోయ్, బీకే బజోరియా స్కూల్ షిల్లాంగ్‌కు చెందిన విద్యార్థులు వ్యోమగామి శుక్లాతో మాట్లాడారు. ఇంతకుముందు కూడా అనేక పాఠశాలలకు చెందిన విద్యార్థులతో శుక్లా మాట్లాడారు. అంతరిక్షంపై విద్యార్థుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
కాగా, యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఫాల్కన్-9 రాకెట్ ద్వారా భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ -విస్నీవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) అంతరిక్షంలోకి ప్రవేశించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన వారి స్పేస్‌క్రాఫ్ట్ గురువారం సాయంత్రం ఐఎస్ఎస్కు చేరుకుంది. సాయంత్రం డాకింగ్ ప్రక్రియ పూర్తవ్వగా, కొద్దిసేపటికే వీరంతా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అక్కడ 14 రోజులు గడపనున్నారు..