విశాఖ మేయర్ హరికుమారిపై అవిశ్వాస నోటీసుపై కౌన్సిల్ సమావేశం…

విశాఖ మేయర్ హరికుమారిపై అవిశ్వాస నోటీసుపై కౌన్సిల్ సమావేశం…

గ్రేటర్ విశాఖ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అవిశ్వాస నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఓవైపు కూటమి నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ సమావేశం ఉండగా…. భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు…
కోరం ఉంటేనే ఓటింగ్….
ఈ సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్‌ నిర్వహించనున్నారు. చేతులెత్తి ఓటుకు ఆమోదం తెలపనున్నారు. హాల్‌లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి ఉండనున్నారు. సభ్యులను రో అధికారులు కౌంట్‌ చేయనున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకే మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

బహిష్కరించిన వైసీపీ….
ఇవాళ జరిగే కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకావొద్దని…. ఎవరైనా ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ విప్ జారీ చేసింది.

అవిశ్వాస తీర్మానం ముందుకు సాగాలంటే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 98 ఓట్లలో కనీసం 74 ఓట్లు రావాలి. జీవీఎంసీలో 98 వార్డులకు 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు 48 మంది టీడీపీ, 11 మంది జనసేన, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు…