టీమిండియా కీలక పోరుకు సిద్ధం…నితీష్ కుమార్ రెడ్డిపై వేటు..!…ఓపెనర్‌గా రోహిత్ శర్మ..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. గురువారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది..

ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచిన విషయం తెలిసిందే.

గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న టీమిండియా.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరులో బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసీస్‌ను ఓడించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచించిన టీమిండియా.. తుది జట్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

నితీష్ కుమార్ రెడ్డిపై వేటు..

ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావించిన టీమిండియా.. పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై వేటు వేయనున్నట్లు ఆసీస్ పర్యటనలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడించారు. బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోతున్న నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో పర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో ప్రతిభ కనబరచలేకపోయాడు..
దాంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారిపోయింది. మరో స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా కొనసాగనున్నాడు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ..

మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్ట్‌కు దూరం కాగా.. అతని గైర్హాజరీలతో కేఎల్ రాహుల్ రాణించాడు. దాంతో రెండో టెస్ట్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. రాహుల్‌నే ఓపెనర్‌గా కొనసాగించారు. అతని కోసం రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో ఆడాడు. కానీ గత రెండు టెస్ట్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు.

ఈ క్రమంలోనే రోహిత్ శర్మను మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కొనసాగే ఛాన్స్ ఉంది. సిరాజ్‌ను పక్కనపెట్టాలని భావిస్తే హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడు.

బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత తుది జట్టు(అంచనా). ఇలా.
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా/మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా .