నేను బ్రతికే ఉన్నా.. చనిపోలేదు’…ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్…

నేను బ్రతికే ఉన్నా.. చనిపోలేదు’

‘బ్రెయిన్ డెడ్’ అయ్యాడని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

కానీ.. తమ దేశాధ్యక్షుడు చనిపోలేదని, బ్రతికే ఉన్నాడని తెలుపుతూ తాజా ఫోటోస్ రిలీజ్ చేసిన ఉత్తర కొరియా

అధికారులతో ఓ ఈవెంట్‌లో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్న ఫోటోలను విడుదల చేసిన నార్త్ కొరియా..

కిమ్ జోంగ్ ఉన్ ఒక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొని పాదరక్షలు, మహిళల దుస్తులను పరిశీలిస్తున్న సరికొత్త ఛాయాచిత్రాలను ఉత్తర కొరియా విడుదల చేసింది. ‘న్యూయార్క్ పోస్ట్’ (NYP) కథనం ప్రకారం.. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ (KCNA) సోమవారం ఈ ఫోటోలను ప్రచురించింది. ఒక గార్మెంట్ అండ్ పాదరక్షల ఎగ్జిబిషన్‌లో కిమ్ పర్యటించినట్లు అందులో పేర్కొంది. పిల్లల బూట్లను నిశితంగా పరిశీలించడం, అధికారులకు సూచనలు ఇవ్వడం, ప్రదర్శనలో ఉంచిన మహిళల కోట్లను పరిశీలించడం వంటి దృశ్యాలు ఈ ఫోటోల్లో కనిపించాయి. అయితే, ఈ ఫోటోలు ఏ రోజున తీశారనే అంశంపై స్వతంత్ర ధ్రువీకరణ ఇంకా లభించలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రాలు
న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన వివరాల ప్రకారం.. విడుదలైన ఛాయాచిత్రాల్లో కిమ్ జోంగ్ ఉన్ ఎంతో ఉల్లాసంగా అధికారులతో మాట్లాడుతున్నారు. ఒక చిత్రంలో గులాబీ రంగు డ్రెస్ ధరించిన మహిళ చేతిలో ఉన్న చిన్న పిల్లల బూటును కిమ్ ముందుకు వంగి పరిశీలిస్తున్నారు. మరో ఫోటోలో చేతులు చాచి అధికారులకు ఏవో కీలక ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇంకో చిత్రంలో ఒక డమ్మీకి (మానెకిన్) తొడిగిన రస్ట్ కలర్ మహిళల కోటు స్లీవ్‌ను పట్టుకుని పరీక్షిస్తుండగా, పక్కనే ఉన్నతస్థాయి సహాయకులు ఉన్నారు.