శ్రీకాకుళం జిల్లా (సిక్కోలు) తెలుగుదేశం పార్టీ (TDP) మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీకాకుళం మేయర్ టికెట్ దక్కకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురై, కన్నీటిపర్యంతమవుతూ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఆమె త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రాజీనామా వెనుక మాజీ మంత్రి, వైసీపి నేత ధర్మాన ప్రసాదరావు కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 1985లో ఎన్టీఆర్ హయాంలో తన భర్త గుండ అప్పలసూర్య టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, అయినా తనకు గుర్తింపు దక్కలేదని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు…
గత రెండేళ్లుగా అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని గుండ లక్ష్మీదేవి భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 40 ఏళ్ల పాటు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయకత్వం వరకూ తన కుటుంబం టీడీపీ అభివృద్ధికి నిరంతరం శ్రమించిందని.. అలాంటి పార్టీని వీడాల్సి రావడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, దివంగత నేత, తన భర్త గుండ అప్పలసూర్యనారాయణ అడుగుజాడల్లో నడిచిన శ్రీకాకుళంలో టీడీపీ ఎదుగుదలకు పనిచేసిన తనకు తగిన గుర్తింపు దక్కలేదని ఆమె కలత చెందారు. ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఆమె టీడీపీ వైఖరిపై రగిలిపోయారు. ఆమెకు వైసీపీ మేయర్ టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. రేపోమాపో ధర్మాన ప్రసాద రావు చొరవతో ఆమె జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయం అని చెప్పకనే తేల్చి చెప్పినట్లు అయ్యింది..