కాల్పులకు ముందు ఆయుధాలతో షూటింగ్‌ ప్రాక్టీస్‌.. వెలుగులోకి కీల‌క విష‌యాలు..!.

కాల్పులకు ముందు ఆయుధాలతో షూటింగ్‌ ప్రాక్టీస్‌.. వెలుగులోకి కీల‌క విష‌యాలు..!
బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడిన నిందితులు ముందుగానే పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడికి ముందు ముంబై సమీపంలోని ఓ ప్రాంతంలో ఆయుధాలతో కాల్పులు జరిపి పరీక్షించినట్లు నిందితులు అంగీకరించినట్లు క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా నిందితులు తాము షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన ప్రాంతాన్ని పోలీసులకు గుర్తించి చూపించారు. వారిలో ఒకరు రెండు రౌండ్లు కాల్పులు జరపగా.. మరొకరు ఒక రౌండ్‌ కాల్పులు జరిపి ఆయుధం సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు ముంబై సమీపంలోని ఆ ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు.
హోటల్‌ గదిలోనూ ప్రమాదవశాత్తూ కాల్పులు దాడికి ముందు ఆయుధాలను పరీక్షించే క్రమంలో మరో కీలక విషయం బయటపడింది. అంధేరీలోని ఓ హోటల్‌ గదిలో తుపాకీని పరీక్షిస్తుండగా ప్రమాదవశాత్తూ కాల్పులు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ బుల్లెట్‌ వెళ్లి బెడ్‌పై తగిలినట్లు సమాచారం. ఈ ఘటనతో దాడికి ముందు నిందితులు ఆయుధాలను సిద్ధం చేసుకున్న తీరుపై పోలీసులు మరింత దృష్టి సారించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ముంబై సమీపంలో కాల్పుల ప్రాక్టీస్‌ చేసిన ప్రాంతాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాడికి ముందు జరిగిన ఏర్పాట్లు, ఆయుధాల వినియోగం, నిందితుల మధ్య సంబంధాలపై సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు.
అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరిక టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో ముంబై పోలీసులు బుధవారం మరో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. ఈ ఇద్దరు నిందితులను తదుపరి విచారణ కోసం ముంబైకి తీసుకురావడానికి పోలీసులు హర్యానాలోని సోనిపట్‌ కోర్టులో ట్రాన్సిట్‌ రిమాండ్‌ కోరనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి లభించిన తర్వాతే వారిని ముంబైకి తరలించనున్నారు. ఈ కేసులో ఆయుధాలను సమకూర్చడంలో ఈ ఇద్దరు అనుమానితులు కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, ఇతర నిందితులతో వీరికి ఉన్న సంబంధాలు ఏమిటి? కాల్పుల ఘటనకు ప్రణాళిక రూపొందించడంలో, దానిని అమలు చేయడంలో వీరి పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.