తుఫాన్ దూసుకువస్తోంది. ఈశాన్య రుతు పవనాల సీజన్లో దూసుకొస్తున్న తొలి తుఫాన్ ఇదే. రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో.. రైతులు ఖరీఫ్ పంట కోత పనుల్లో ఉన్న సమయంలో అందరి దృష్టినీ తన వైపు మళ్లించేలా తుఫాన్ తీవ్రత ఉండబోతోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించేలా దూసుకొస్తున్న తుఫాన్… అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి తీరాన్ని తాకనున్నది. ముఖ్యంగా ఈ నెల 27, 28 తేదీల్లో ఉత్తర కోస్తాలో గంటకు 120 నుంచి 160 కిలోమీటర్లు.. అప్పుడప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ఇదే సమయంలో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఈమేరకు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో రెండు రోజులపాటు కొనసాగిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఉదయం తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుంది. ఈ క్రమంలో పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆపై మరింత బలపడి 26వ తేదీకల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూనే తుఫాన్‌గా మారుతుంది. ఈ తుఫాన్‌కు ‘ఆర్నాబ్’ అని పేరు పెట్టనున్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో తుఫాన్ మరింత బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది…ఈ క్రమంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మధ్య (కళింగపట్నం- మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని పలు మోడళ్లు, విశాఖపట్నం- కాకినాడ మధ్య అని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి) తీరం దాటనున్నదని పేర్కొంది. 27 నుంచి ఉత్తరకోస్తా జిల్లాల్లో తీరం వెంబడి, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 120 నుంచి 160, అప్పుడప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. కోస్తాలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం నుంచి కృష్టా జిల్లా వరకు భారీ నుంచి అతిభారీగా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 28న అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, పోలవరం, తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో అతిభారీ, గుంటూరు నుంచి నెల్లూరు వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు శనివారం ఉదయానికల్లా తీరానికి చేరుకోవాలని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.కోస్తాంధ్రలో సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు, రైతులు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సహాయం, తుపాను సమాచారం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నంబర్లు సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఆదివారం ( 25-10-2026) : అల్లూరి ,పోలవరం, కృష్ణా , గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం (26-10-2026): రాయలసీమ జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం ( 27-10-2026) : విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ; ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం (28-10-2026) : అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ; గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
దూదెకొండలో 68 మి.మీ వర్షపాతం
ఇకపోతే శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి కర్నూలు జిల్లా దూదెకొండలో 68మిమీ, దేవనకొండలో 52.1మిమీ, నంద్యాల జిల్లా సంజామలలో 41.99మిమీ, కర్నూలు జిల్లా లద్దగిరిలో 40.5మిమీ, మొలగవల్లిలో 39.6మిమీ, ఓర్వకల్లులో 39.2మిమీ, నంద్యాల జిల్లా రామాపురంలో 35.5మిమీ, తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగలో 35.2మిమీ, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 35.1మిమీ, ప్రకాశం జిల్లా ఉప్పమాగులూరు34.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.