ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుతోంది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చెలరేగిన హింస, ఉద్రిక్తతల పట్ల పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. అక్టోబర్ 23వ తేదీ ఒక్కరోజే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో మొత్తం 14 ఎన్నికల సంబంధిత హింస సంఘటనలు నమోదైనట్లు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వెల్లడించింది. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 17 మంది నిందితులను గుర్తించిన పోలీసులు, మిగతా వారిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారు, హింసకు పాల్పడేవారు లేదా ప్రత్యర్థులను బెదిరించే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీశ్ కుమార్ గుప్తా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. ఎంతటి రాజకీయ నాయకులైనా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం లేదా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి బలప్రయోగానికి పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. ఎంతటి రాజకీయ ప్రభావం ఉన్నా, పదవుల్లో ఉన్నా, లేదా జన సమీకరణ చేసే శక్తి ఉన్నా చట్టం నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పల్నాడు, కడప జిల్లాల్లో అత్యధికంగా మూడేసి ఘటనలు చోటుచేసుకోగా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండేసి ఘటనలు నమోదయ్యాయి. ఇక తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో సంఘటన వెలుగు చూసింది. ఉద్రిక్తతలు తలెత్తిన వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమస్యాత్మక నామినేషన్ కేంద్రాలు, గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించడమే కాకుండా, అవసరమైన ప్రాంతాల్లో అభ్యర్థులకు రక్షణ కల్పిస్తూ ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 31 ఘటనలు నమోదయ్యాయని, వీటికి సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసినట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, కనీసం 54 మందిని నిందితులుగా గుర్తించినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్లను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.నమోదైన ఘటనల్లో 22 హింస, ఘర్షణలకు సంబంధించినవి కాగా, తొమ్మిది నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించినవని తెలిపారు. మొత్తం 16 సందర్భాల్లో పత్రాల ధ్వంసం జరిగినట్లు పేర్కొన్నారు. ఆరు ఘటనల్లో రాళ్లు, కర్రలతో దాడులు, నాలుగు వాహనాలకు నిప్పుపెట్టడం, రెండు నివాస గృహాలపై దాడులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఒక ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేయగా, కాల్పుల ఘటన నమోదైందని వెల్లడించారు. ఘర్షణల్లో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, పోటీలో ఉన్న అభ్యర్థితో సహా ఇద్దరు వ్యక్తులు విషమ పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.ఈ ఘటనల్లో టిడిపి, వైసిపి, సిపిఎంఅభ్యర్థులతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి దాడులకు, అడ్డంకులకు గురయ్యారని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తే పార్టీల కతీతంగా
దృఢత్వంతో చర్యలు తీసుకుంటామన్నారు. హింసాత్మక గుంపులను చెదరగొట్టేందుకు మూడు చోట్ల లాఠీచార్జి, ఒక ఘటనలో రెండు బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు తెలిపారు.వీడియోలు, సిసిటివి దృశ్యాలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా బెదిరింపులు, హింసాత్మక ఘటనలు ఎదురైతే 100, 112కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.