కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. పంట పొలాల్లో ఉన్న గ్యాస్ పైప్‌లైన్ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 26వ తేదీన ఇదే ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్ లీకై కలకలం సృష్టించగా, తాజాగా అదే పైప్‌లైన్ మరోసారి లీక్ కావడం గ్రామస్తుల్లో ఆందోళనకు కారణమైంది..పైప్‌లైన్ నుంచి గ్యాస్ ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించింది. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితిని సమీక్షించి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. అయితే, ఒకసారి లీకైన పైప్‌లైన్ మళ్లీ లీక్ కావడంతో స్థానికుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు పైప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని మాచవరం గ్రామస్తులు కోరుతున్నారు..
శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తుల డిమాండ్.
గ్యాస్ లీకేజీ ఘటనలు పునరావృతం కావడంతో మాచవరం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే పైప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని కోరుతున్నారు. పైప్‌లైన్ పరిస్థితిని నిపుణులతో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ వంటి ఘటనలు వ్యవసాయ పనులు చేసుకునే రైతులతో పాటు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనూ భయాందోళనలు కలిగిస్తాయి.