తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు DA పెంపు..
19.2% నుంచి 21.8 శాతానికి పెరిగిన DA.. 2026 జులై 1 నుంచి పెరిగిన DA అమలు.. 71,360 మంది ఉద్యోగులకు ప్రయోజనం..
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వీరికి చెల్లించే కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)ను 2.543 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రస్తుతం 19.27 శాతంగా ఉన్న డీఏ, డీఆర్ 21.81 శాతానికి చేరనున్నాయి. పెంచిన డీఏ, డీఆర్‌ను జులై 1 నుంచి అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం విద్యుత్ సంస్థల సీఎండీలను ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో పనిచేస్తున్న 71,360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం విద్యుత్ సంస్థలపై ఏటా రూ.175 కోట్ల అదనపు భారం పడనున్నది. ………
ధరల సూచీ ఆధారంగా సవరణ..
ట్రాన్స్‌కో, జెన్కో, సదరన్ డిస్కమ్, నార్తర్న్ డిస్కమ్‌లలో పనిచేస్తున్న 31,933 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 19,116 మంది ఆర్టిజన్లు, 20,311 మంది పెన్షనర్లకు ఈ పెంపుతో లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ సంస్థల సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగానే డీఏ, డీఆర్ పెంపునకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో ప్రకటించే అఖిల భారత ధరల సూచీ ఆధారంగా డీఏ, డీఆర్‌లను సవరిస్తారు. ధరల సూచీలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి.. జనవరి, జులై నెలల్లో ఈ సవరణ చేపడతారు. తాజా పెంపు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలోని ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెంపు వల్ల విద్యుత్ సంస్థలపై నెలకు సుమారు రూ.14.63 కోట్ల చొప్పున ఏటా రూ.175 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనున్నది.