మల్లన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. రెండు కార్లు ధ్వంసం..
భార్యాభర్తలు సీరియస్.. నలుగురికి గాయాలు..
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద తీన్మార్ మల్లన్న పాదయాత్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు పాదయాత్ర సాగుతున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన (టీఎస్ 30 టి 7596) చౌటుప్పల్ మండలం జై కేసారానికి చెందిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారు (టీఎస్ 30 ఎల్ 444)ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో టీఎస్ 04 8919 నంబర్ గల కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిలో తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందనతో పాటు రెండేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో నార్కపల్లి కామినేని ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ సురేష్‌కు కూడా గాయాలు కావడంతో మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అలాగే తీన్మార్ మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు తెలిసింది.లారీ ఢీకొట్టిన తీవ్రతకు మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న కారులో కాకుండా కాలినడకన పాదయాత్రలో ముందుకు సాగుతుండటంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసుల సమాచారం. కాగా, పాదయాత్రలో ఒక్కసారిగా ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.