శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ‘భారత్‌ను చూడండి. అక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ 7 శాతం జీడీపీ వృద్ధిని సాధిస్తున్నారు. అమెరికాలోనూ వడ్డీ రేట్లు తగ్గిస్తే మన జీడీపీ వృద్ధి 14, 15 శాతానికి.. బహుశా 20 శాతానికి కూడా చేరుకునేది. మనం అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం నిజంగా బాధాకరం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకెళ్లేందుకు తక్కువ వడ్డీ రేట్లు అవసరమన్నది ట్రంప్ వాదన. అయితే ఆయన చెప్పిన 20 శాతం జీడీపీ వృద్ధి ఒక అంచనా మాత్రమే. అది సాధ్యమవుతుందని నిర్ధారించే ఆర్థిక గణాంకాలు లేవు.
అమెరికా అధ్యక్షుడు తమ దేశ కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్‌పై విమర్శలు గుప్పించారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయని, ఏడు శాతం ఆర్థిక వృద్ధి నమోదవుతోందని ప్రశంసించారు. అమెరికా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే 15 నుంచి 20 శాతం వరకు జీడీపీ వృద్ధి సాధించవచ్చని వ్యాఖ్యానించారు..వైట్‌హౌస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంస్థ రాజకీయ ప్రభావంతో పనిచేస్తోందని విమర్శించారు. ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉన్న సమయంలో వడ్డీ రేట్లను తగ్గించాల్సింది పోయి పెంచడం ఏమిటని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పుడు అప్పులు తీసుకునేవారికి ఖర్చు తగ్గించాలని, కానీ అమెరికా కేంద్ర బ్యాంకు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతోందని అన్నారు.
వడ్డీ రేట్లు తగ్గించడం సులభమేనా?..
ఇక్కడే అసలు విషయం ఉంది. అమెరికా అధ్యక్షుడు కోరుకున్నంత మాత్రాన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించలేదు. ఎందుకంటే ఆ సంస్థకు కొన్ని కీలక బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది.
వడ్డీ రేట్లు తగ్గితే వ్యాపార సంస్థలు, ప్రజలకు రుణాలు తీసుకోవడం సులభమవుతుంది. పెట్టుబడులు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు తీసుకుంటుంది.
మొత్తానికి భారత్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని ప్రస్తావిస్తూ అమెరికా జీడీపీని 20 శాతానికి తీసుకెళ్లవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు అమెరికా ఆర్థిక విధానాలను గమనిస్తున్న తరుణంలో, భారత్‌ను ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి.