సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ గెలుపు…

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది. తుది పోరులో భారత్ తో తలపడనుంది. లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఫైనల్ కి చేరింది కివీస్…తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్ సన్ సెంచరీలతో చెలరేగారు. రచిన్ 101 బంతుల్లో 108 పరుగులు చేయగా, విలియమ్ సన్ 94 బంతుల్లోనే 102 రన్స్ చేశాడు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 49 పరుగులతో విజృభించారు…

మ్యాచ్ హైలెట్స్
మ్యాచ్ ఆఖర్లో అద్భుతమైన షాట్లతో డేవిడ్ మిల్లర్ అలరించాడు. కేవలం 67 బంతుల్లోనే 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. వన్డేల్లో డేవిడ్కి ఇది ఆరో సెంచరీ. కెప్టెన్‌ బవుమా 56(71), డస్సెన్‌ 69(66)లు అర్ధ సెంచరీలు చేశారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 3(7) నిరాశపర్చాడు. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ శాంట్నర్‌ 3 వికెట్లు తీశాడు. ఫిలిప్స్‌, హెన్రీ 2, బ్రేస్‌వెల్‌, రచిన్‌ రవీంద్ర ఒక్కో వికెట్‌ తీశారు.

తొలి ఓవర్‌లో 8 పరుగులతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 4 ఫోర్లు బాది దూకుడుగా కనిపించిన రికెల్టన్‌ 17(12) 4.5వ ఓవర్‌లో హెన్రీ బౌలింగ్‌లో బ్రేస్‌వేల్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డస్సెన్‌ కెప్టెన్‌ బావుమాతో కలిసి స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. ఇద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. శాంట్నర్‌ బౌలింగ్‌లో బావుమా క్యాచ్‌ మిస్‌ చేసిన విలియమ్సన్‌ మరోసారి ఆ తప్పిదానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో 56 పరుగుల వద్ద బవుమా పెవిలియన్‌ బాటపట్టాడు. డస్సెన్‌ (69)ను శాంట్నర్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటినుంచి సఫారీల పతనం మొదలైంది. మిల్లర్‌ చివరి వరకు పోరాడినప్పటికీ రన్‌రేట్‌ అంతకంతకూ పెరిగిపోవడంతో ఫలితం లేకపోయింది. మార్‌క్రమ్‌ 31(29), క్లాసెన్‌ 3(7), ముల్డర్‌ 8(13), మార్కో యాన్సెన్‌ 3(7), కేశవ్‌ మహారాజ్‌ 1(4), రబాడా 16(22), ఎంగిడి 1*(2) పరుగులు చేశారు.

సెంచరీలో చెలరేగిన రచిన్, విలియమ్సన్
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర 108 (101), కేన్‌ విలియమ్సన్‌ 102 (94) సెంచరీలతో చెలరేగిపోయారు. మ్యాచ్‌ ఆఖర్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఫిలిప్స్‌ 49*(27) మెరుపు ఇన్సింగ్స్‌ ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, రబాడా 2 వికెట్లు, ముల్డర్‌ 1 వికెట్‌ తీశారు..