బీఆర్ఎస్‌ కు మించి కాంగ్రెస్ అరాచకాలు..మీకు 48 గంటల టైమ్ ఇస్తున్నా.. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్…

ఓ మహిళలను కులం పేరుతో దూషించాడని మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్‌ (Yeta Madhuka)పై పోలీసులు అట్రాసిటీ కేసు (Atrocity Case) నమోదు చేశారు..దీంతో అతడు ఆ అవమానాన్ని భరించలేక సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే మధుకర్‌ కుటుంబాన్ని ఇవాళ పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నీల్వాయ్‌కి వెళ్లారు. కుటుంబ దుస్థితి, కాంగ్రెస్ నేతల వేధింపులు, పోలీసుల అరాచకాలను వివరిస్తూ మధుకర్‌ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టారు. ఆ మాటలు విని చలించిపోయిన బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా బీజేపీ ఆదుకుంటుందని భరోసానిచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధుకర్‌ ఆత్యహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని.. అందుకు పోలీసులకు 48 గంటల సమయం ఇస్తున్నానని డెడ్‌లైన్ పెట్టారు. మధుకర్‌ను వేధించిన పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ (BRS)కు మించి కాంగ్రెస్ (Congress) అరాచకాలు కొనసాగుతున్నాయని కామెంట్ చేశారు. నక్సలైట్ల తూటాలకే భయపడని తెగింపు బీజేపీ కార్యకర్తలదని.. కాంగ్రెస్ అరాచకాలను ఎదిరిస్తామని ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు వత్తాసు పలికే పోలీసులకు చుక్కలు చూపిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. గూండాగిరి చేసే నాయకులను యూపీ తరహాలో శిక్షిస్తామని బండి సంజయ్ తెలిపారు..