రాజస్థాన్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
రాజస్థాన్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా కార్యక్రమం
గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం
14ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకా అందిస్తామని వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ
కోటీ 15 లక్షల మంది బాలికలకు టీకా అందించనున్నట్లు పేర్కొన్న కేంద్ర ఆరోగ్యశాఖ
కాసేపట్లో రాజస్థాన్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేయనున్న మోదీ
గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా, 14 ఏళ్ల లోపు బాలికల కోసం రూపొందించిన దేశవ్యాప్తగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రారంభించనున్నారు. ‘స్వస్థ నారి’ పేరుతో మహిళా ఆరోగ్య రంగంలో సమానత్వం, రక్షణ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని కేంద్ర వెల్లడించింది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఈ టీకాను ఉచితంగా అందిస్తారు. ఈ వ్యాక్సినేషన్ను పూర్తిగా ఐచ్ఛికం చేశారు. టీకా ఇచ్చే ముందు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోనున్నారు. టీకాల కార్యక్రమం మొదటి 3 నెలల పాటు ‘మిషన్ మోడ్’లో కొనసాగనుంది. ఆ తర్వాత క్రమం తప్పకుండా జరిగే సాధారణ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో భాగంగా అందుబాటులో ఉండనుంది…
ఏటా 1.15 కోట్ల మంది బాలికలకు టీకా
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ డ్రైవ్ ప్రారంభం కానుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ నారి’ విజన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రైవేట్ మార్కెట్లో వేల రూపాయల ఖరీదు చేసే ఈ టీకాను, ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ టీకా లభిస్తుంది. నిర్దేశిత కేంద్రాల్లో రోజూ టీకాలు వేయించుకోవచ్చు. మొదటి మూడు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు. ఈ 90 రోజుల కాలంలో అర్హులైన బాలికలకు రోజూ టీకా వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత, ఇది దేశవ్యాప్త సాధారణ రోగనిరోధక షెడ్యూల్లో చేర్చుతారు.
తల్లిదండ్రుల అనుమతితోనే టీకాలు
హెచ్పీవీ వ్యాక్సినేషన్లో భాగంగా ‘గార్డసిల్ 4’ అనే క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ను వేయనున్నారు. ఇది క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ రకాలు 16, 18తో పాటు, ఇతర వైరల్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత జాతీయ సాంకేతిక సలహా బృందం సిఫార్సుల మేరకు, 14 ఏళ్ల బాలికలకు ఒక్క డోస్ టీకా కూడా సరిపోతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ టీకా కార్యక్రమాన్ని శిక్షణ పొందిన మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. టీకా వేసిన తర్వాత తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రాలను అత్యవసర సదుపాయాలున్న ఆసుపత్రులతో అనుసంధానించారు. అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి ‘ఇన్ఫార్మ్డ్ కన్సెంట్’ తీసుకున్న తర్వాతే టీకా ఇస్తారు.