యాక్సిడెంట్ కేసులతో పెరుగుతున్న కేసుల భారం..!

యాక్సిడెంట్ కేసులతో పెరుగుతున్న కేసుల భారం..

పోలీసులు కోర్టుకు పంపుతున్న కేసులలో యాక్సిడెంట్ కేసులు, మాదకద్రవ్యాల వినియోగం కేసులు అధికంగా ఉంటున్నాయని వాటితో కోర్టులలో పెండింగ్ కేసుల భారం రోజురోజుకు పెరుగుతోందని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ తెలిపారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఆటో వర్కర్స్ తో జరిపిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆటో వర్కర్స్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మైనర్ పిల్లలు వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తే వారితో పాటుగా వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని ఆ కేసులలో 10 వేల రూపాయల జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా విధించటం జరుగుతుందని న్యాయమూర్తి వివరించారు. ఎవరైనా బాలలు మాదకద్రవ్యాల వినియోగానికి బానిసలైనట్లు గా ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే మండల న్యాయ సేవ అధికార సంస్థ అధికారులకు గానీ, పోలీసులకు గానీ తెలియపరచినట్లయితే వారిని మానసిక పరివర్తన మరియు పునరావాస కేంద్రానికి పంపి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇప్పించి ఆ వ్యసనం నుండి వారిని కాపాడడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించాలని అలాగే మాదకద్రవ్యాల నిర్మూలనకు విశేష కృషి జరపాలని ఆమె పిలుపునిచ్చారు. బైకు నడుపుతున్న యువకులు గొప్పలకు పోయి తిప్పలు పడవద్దని న్యాయమూర్తి హితవు పలికారు. మాదకద్రవ్యాల కేసులలో ముద్దాయిగా మారితే ఆ యువకుడి బంగారు భవిష్యత్తు సర్వనాశనం కావటంతో పాటుగా జైలు జీవితాన్ని గడపవలసి ఉంటుందని ఆమె తెలిపారు. సిఐ చరమంద రాజు మాట్లాడుతూ గంజాయి విక్రేతలపై ఇప్పటికే 4 కేసులు నమోదు చేసి 30 మందిని జైలుకు పంపామని వారిలో ముగ్గురిని మానసిక పరివర్తన మరియు పునరావాస కేంద్రానికి పంపించామని తెలిపారు. అనంతరం సభికుల చేత రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్ రాఘవరావు, భూక్య నాగేష్ రాథోడ్, జక్కుల వీరయ్య, ఉప్పల గోపాలకృష్ణమూర్తి, జుట్టుకొండ సంధ్య, సుంకరి ప్రదీప్తి, రామారావు, అడవి రాముడు, పాలేటి శ్రీనివాసరావు, మద్దుల నాగేశ్వరరావు, వెంకటేష్ నాయక్, దాసరి మోహన్, రమణారెడ్డి, న్యాయశాఖ సిబ్బంది అనిత, సుశీల, పోలీసులు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959