అదే మా విజయానికి కారణం: శుభ్మన్ గిల్.
ఫీల్డింగే తమ విజయానికి ప్రధాన కారణమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని ఓడించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్మన్ గిల్.. ఆర్సీబీ లాంటి భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టును 160 పరుగుల్లోపే కట్టడి చేయడం సంతోషంగా ఉందన్నాడు.
ఆర్సీబీని ఆలౌట్ చేశాం అంటే..
‘చాలా సంతృప్తిగా ఉంది. ఇలాంటి వికెట్పై ఆర్సీబీ లాంటి జట్టును 160 పరుగుల లోపే కట్టడి చేయడం అంటే మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని అర్థం. మా విజయానికి మా ఫీల్డింగ్ ప్రధాన కారణం. కొన్ని మ్యాచ్ల్లో మేం సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు. కానీ ఈ రోజు అందరూ సమష్టిగా రాణించారు. మైదానంలో మా ఉత్సాహం బాగుంది. ముఖ్యంగా రెండో ఓవర్లో విరాట్ భాయ్ కొన్ని పరుగులు చేసిన తర్వాత, మేం పుంజుకున్న తీరు చాలా కీలకం.
నిజానికి పవర్ ప్లేలో నేను దూకుడుగా ఆడాలని ఏం అనుకోలేదు. నేను ఆ జోన్లో ఉన్నట్లు అనిపించింది. తొలి బంతికే కొంచెం అదృష్టం కలిసి వచ్చింది. రెండో బంతి నా జోన్లోకి రావడంతో ‘ఈ రోజు నా రోజే’ అని అనిపించింది. చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాననిపించింది. అందుకే బౌలర్లపై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నాను…
మా ఓటమి కారణం ఇదే..రజత్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు..
జట్టు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 15.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని అన్నారు.
బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణం. శుభ్మన్ గిల్ పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడి తమపై ఒత్తిడి పెంచాడు. కానీ, తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంవల్ల మళ్లీ పుంజుకున్నాం. అయితే ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేక పోయాం. మేము చేసిన పరుగులు ఈ వికెట్ పై ఏమాత్రం సరిపోవని మాకు తెలుసు.. కానీ, మా బౌలర్లు బౌలింగ్ చేసిన తీరు.. మ్యాచ్ను 16వ ఓవర్ వరకు తీసుకెళ్లడం సానుకూల సంకేతం. ఈ పిచ్ పై గడ్డి ఉండటం వల్ల పాస్ట్ బౌలర్లకు సహకరించింది.
మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం కూడా మా ఓటమికి ప్రధాన కారణం. చెప్పాలంటే అక్కడే మేము పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాం. ఈ తప్పిదాలను మరో మ్యాచ్ లో పునరావృతం కాకుండా సరిచేసుకోవాలి. ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయి. మేము ఒక్కో మ్యాచ్ పై దృష్టి పెడతాం. ఇది సుదీర్ఘమైన టోర్నీ.. మేము పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.