ఇన్ని ఇండస్ట్రీలు ఉండి కూడా అభివృద్ధి శూన్యం.. పొల్యూషన్లతో , ఆక్రమణలతో ఇబ్బందులు పడుతున్నారు.. ఆశించిన అభివృద్ధి లేదు.. కవిత.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ ర్యాలీతో ఇందిరా చౌక్ నుండి ర్యాలీగా వెళ్లి ఆమె అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడి వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. హుజూర్‌నగర్‌తో జాగృతి సంస్థకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. కృష్ణ పట్టి ప్రాంతంలో తాము కాళ్లు అరిగే వరకు తిరిగామని, అక్కడ దొరికిన ఆనవాళ్లను తమ చరిత్ర పుస్తకాల్లో పొందుపరిచామని తెలిపారు. సాయుధ పోరాటంలో హుజూర్‌నగర్ పాత్ర ఎంతో కీలకమైందని, మగ్దూమ్ మెయినోద్దీన్ లాంటి గొప్ప నాయకులు ఈ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారని గుర్తు చేశారు.
అలాంటి చరిత్ర ఉన్న హుజూర్‌నగర్‌లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, నీళ్లు, సహజ వనరుల వినియోగంలో ఈ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పులిచింతల ప్రాజెక్టు కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 13 వేల టన్నుల సున్నపు రాయి గనులను కోల్పోయామని తెలిపారు.
ఈ ప్రాంతంలోని పరిశ్రమలు ఇతర ప్రాంతాల వారికి చెందినవేనని, ఇక్కడ ఉన్న ఖనిజ సంపదపై స్థానికులకు ఎంత అధికారం ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. స్థానికంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి శూన్యంగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గ స్థాయిలో ఇంత దారుణ పరిస్థితి ఉండటం చాలా బాధాకరమన్నారు.
పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై ఎలాంటి చర్యలు లేవని, పులిచింతల ప్రాజెక్టు కారణంగా ఆదాయాన్ని తెచ్చే సున్నపు రాయి నిక్షేపాలు కోల్పోయామని తెలిపారు. అదే విధంగా పచ్చటి పొలాలు నీటిపాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట ప్రాంతాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, భూముల ఆక్రమణలపై ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న స్థానిక యువతను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉద్యోగాలు లేక యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. సాగర్ లెఫ్ట్ కాల్వ పూర్తిగా నిలిచిపోయినా, అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ రెండూ పట్టించుకోవడం లేదన్నారు.
హుజూర్‌నగర్–కోదాడ నియోజకవర్గాల్లో ఉన్న 21 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో కేవలం రెండు మూడు మాత్రమే సరిగా పనిచేస్తున్నాయని తెలిపారు. లిఫ్ట్‌లు పనిచేయకపోతే కొత్తగా లిఫ్ట్‌లు ఎందుకు అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 ఏళ్లకు ప్రాథమిక అవసరాలైన ఉద్యోగాలు, విద్య, వైద్యం అందకపోవడం మనం ఎక్కడ తప్పు చేశామో ఆలోచించాల్సిన పరిస్థితి అని అన్నారు. తెలంగాణ వచ్చినా పేదల సంఖ్య తగ్గలేదని, ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల కోసం 83 లక్షల దరఖాస్తులు ఉన్నాయని, అందులో 18 లక్షల మంది అర్హులని లెక్కలు చెబుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది 4 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పిందని, కానీ దానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారో, ఎంత ఖర్చు చేశారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో హౌసింగ్ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అనుభవంతో లెక్కలు చెప్పాలని సూచించారు.
కృష్ణానది నీటి విషయంలో కూడా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. కృష్ణానది స్టేక్ హోల్డర్స్‌గా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయని, అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం కృష్ణా నది నీళ్లను కాపాడాలని డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ లేకపోతే హుజూర్‌నగర్‌లో వ్యవసాయమే లేదని, కానీ దాని లెఫ్ట్ కెనాల్ మెయింటెనెన్స్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో ఉన్న 54 లిఫ్ట్‌లలో 17 పాక్షికంగా, 21 పూర్తిగా పనిచేయడం లేదని తెలిపారు. అలాంటప్పుడు 1800 కోట్లతో కొత్త లిఫ్ట్ నిర్మాణం ఎందుకు అంటూ ప్రశ్నించారు. గతంలో ఇదే లిఫ్ట్ ప్రాజెక్టును వ్యతిరేకించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట ప్రజల కోసం పనిచేస్తుందని, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేస్తామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతి రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కచ్చితంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959